- శుక్రవారం ఉదయం శంకర్‌గౌడ్ మృతి
- అల్లుడి గ్రామమైన ముత్తోజిపేటకు డెడ్‌బాడీ తరలింపు..
- పరామర్శకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- శంకర్ డెడ్ బాడీని స్ట్రెచర్‌పై నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలించే ప్రయత్నం..
- అడ్డుకున్న పోలీసులు
- మండుటెండలో హైవేపై 3 గంటల పాటు కేంద్రమంత్రి ఆందోళన
- బంధువుల ఆగ్రహంతో వెనుదిరిగిన సంజయ్, సీపీ.. ముగిసిన అంత్యక్రియలు
వరంగల్/నర్సంపేట, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండంలోని ముత్తోజీపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ముత్తోజీపేటకు వచ్చారు.
శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో దగ్గరకు తరలించాలని కార్మికులు పట్టుబట్టగా.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో కార్మికులు అనూహ్యంగా డెడ్‌బాడీ ఉన్న ఫ్రీజర్‍ను లాకెళ్లే ప్రయత్నంలో భాగంగా 100 మీటర్ల వరకు ముందుకు తెచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ మంత్రి బండి సంజయ్ రోడ్డుమీద బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అటు బండి సంజయ్.. ఇటు సీపీ సన్‌ప్రీత్ సింగ్ పట్టుదలగా ఉండడంతో దాదాపు 3 గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
ఉద్రిక్తత నడుమే ముత్తోజీపేటకు ..
నర్సంపేట డిపోలో డ్రైవర్‍గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆయనకు మొదట ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమిచండంతో హైదరాబాద్‌కు తరలించారు. అపోలో హాస్పిటల్‍లో చికిత్స తీసుకుంటున్న శంకర్ గౌడ్ శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఆయన స్వస్థలం ఖానాపూర్ మండల కేంద్రమైనా.. అంత్యక్రియలు ముత్తోజీపేటలోని అతని అల్లుడి ఇంటివద్ద నిర్వహించాలని బంధువులు నిర్ణయించారు. దీంతో ఉదయం 7 గంటలు దాటాక డెడ్బాడీని ఇక్కడకు తీసుకొచ్చారు. శంకర్ మృతికి సంతాపంగా వరంగల్ ఆర్టీసీ జేఏసీ అన్ని డిపోల పరిధిలో బంద్‍కు పిలుపునిచ్చింది.
వారికి బీఆర్‍ఎస్, బీజేపీ మద్దతిచ్చాయి. ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉందని భావించిన పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. నివాళి అర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాలతో పాటు బీఆర్‍ఎస్, బీజేపీ నేతలను అనుమతించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఏనుగుల రాకేశ్ రెడ్డి నివాళి అర్పించారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపో వద్దకు తీసుకెళ్తామని జేఏసీ నేతలు పట్టుబట్టగా పోలీసులు వారించారు. దాంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొన్నది. జేఏసీ నేతలతో కలిసి ఆందోళన చేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఖమ్మం జిల్లాలోని పోలీస్ స్టేషన్‍కు తరలించారు. ఆపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రాకేశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.
సంజయ్ రాక.. నడిరోడ్డుపై హైడ్రామా
శంకర్ గౌడ్‍కు నివాళులు అర్పించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భారీ కాన్వాయ్‍తో ముత్తోజీపేటకు వచ్చారు. బీజేపీ, జేఏసీ నేతలతో కలిసి నివాళి అర్పించారు. అదేసమయంలో శంకర్ మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపో వద్దకు తరలించేందుకు ఫ్రీజర్‍ను నర్సంపేట, మల్లంపల్లి నేషనల్ హైవేమీదకు కార్మికులు ఈడ్చుకువచ్చారు.
ఊహించని ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బండి సంజయ్ ఎండలోనే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, బీజేపీ, జేఏసీ నేతల మధ్య తోపులాటలతో వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు స్పృహతప్పి పడిపోయారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్ సింగ్ పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో ముత్తోజీపేటకు చేరుకున్నారు.
కేంద్ర మంత్రి దగ్గరకు వెళ్లి పరిస్థితిని సీపీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ఫోన్‍లో మాట్లాడించారు. అయినా.. బండి సంజయ్ వెనక్కి తగ్గలేదు. మృతదేహాన్ని నర్సంపేటకు తీసుకువెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. శంకర్ కుటుంబ సభ్యులను తమ వాహనంలో తీసుకువెళ్తానని కూర్చోబెట్టుకున్నారు.
వరంగల్ సీపీ మాత్రం శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పా రు. ఇటు పోలీసులు.. అటు కేంద్రమంత్రి మొండికేయడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. 4 గంటల వరకు నడరోడ్డుపై హైడ్రామా కొనసాగింది.
బంధువుల ఆగ్రహంతో అంత్యక్రియలు
అంత్యక్రియల విషయం ఎటూ తేలకపోవడంతో మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పుట్టెడు దుఃఖంలో ఉంటే..నాయకులు, పోలీసులు మృతదేహాన్ని నడిరోడ్డుపై పెట్టి తమను ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
శంకర్ గౌడ్ తమ ఊరివాడు కాకున్నా అంత్యక్రియలకు ఒప్పుకుంటే మృతదేహాన్ని ఇంటికి.. రోడ్డుమీదకు తిప్పుతూ రాజకీయాలేంటని నిలదీశారు. అంత్యక్రియలు చేసుకోవడానికి సహకరించాలని బండి సంజయ్‌ని, పోలీసులను శంకర్ గౌడ్ బంధువులు, జేఏసీ సభ్యులు కోరారు. దాంతో బండి సంజయ్, పోలీస్ ఉన్నతాధికారులు వెళ్లిపోవడంతో సాయంత్రం 7 గంటలకు దహన సంస్కరాలు నిర్వహించారు.
రూ.15 లక్షల ఆర్థిక సాయం, ఉద్యోగం ప్రకటన
శంకర్ గౌడ్ డెడ్‌బాడీకి నర్సంపేట ఆర్టీవో ఉమారాణి నివాళి అర్పించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్టు చెప్పారు. అలాగే, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతంగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
నర్సంపేట డిపో ఏమన్నా పాకిస్తాన్‌లో ఉందా?: సంజయ్
25 ఏండ్లపాటు పనిచేసిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‍కు తోటి కార్మికులు నివాళి అర్పించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘నర్సంపేట ఆర్టీసీ డిపో ఏమన్నా పాకిస్తాన్‌లో ఉన్నదా? బంగ్లాదేశ్‌లో ఉన్నదా?’’ అని ఎద్దేవా చేశారు.
శుక్రవారం ముత్తోజీపేటలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. శంకర్ కుమారుడు, కుటుంబ సభ్యులు.. మృతదేహానికి నివాళులు అర్పించేందుకు నర్సంపేట డిపో వద్దకు వెళ్లనివ్వాలని బతిమిలాడితే పోలీసులు బెదిరించారన్నారు. ‘‘ 5 నిమిషాలు నేనే వాహనం నడుపుతా.. శంకర్ డెడ్‍బాడీని నేనే డిపో వద్దకు తీసుకెళ్తా. ఎలాంటి శాంతిభద్రతల ఇష్యూ రాకుండా చూసుకుంటానని కేంద్ర మంత్రిగా హామీ ఇస్తున్నా” అని తానే స్వయంగా చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని మండిపడ్డారు.
ఇది ప్రభుత్వం చేసిన హత్య అని, దీనికి ఇంత నిర్బంధం ఎందుకని ఫైర్ అయ్యారు. ఆర్టీసీలో కార్మికుల దుర్భర జీవితాలకు శంకర్ గౌడ్ నిదర్శనమని, ఏండ్ల తరబడి కార్మికుడిగా పనిచేస్తున్నా.. కనీసం సొంత ఇల్లు లేదని, బిడ్డ ఇంటివద్ద అంత్యక్రియలు చేసుకోవాల్సిన దుస్థితి ఉందని తెలిపారు.

